వివేకా హత్య కేసులో సునీత పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందించేందుకు రెండు వారాల సమయం కావాలని సీబీఐ కోరగా, ఈ నెల 27వ తేదీలోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై సునీత అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థ పలు అనుమానాస్పద, సందేహాస్పద అంశాలను విస్మరించిందని, కేసులో లోతైన విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని ఆమె తన పిటిషన్‌లో అభ్యర్థించారు.

సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఈ నెల 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. 

సీబీఐ కౌంటర్ దాఖలు చేశాక, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి దర్యాప్తుపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

YS Vivekananda Reddy
Sunitha Reddy
Viveka murder case
Telangana High Court
CBI investigation
counter affidavit
Andhra Pradesh politics
murder investigation
political crime
court hearing

More Telugu News